- అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పేదలు, నిస్సహాయులకు దసరా కానుకగా అక్టోబర్ నుంచే కొత్త పింఛన్ల పంపిణీ ప్రక్రియను ప్రారంభించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. దసరా పండుగ నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త పింఛన్ అందేలా ఏర్పాట్లు చేయాలని సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్‌కు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి క్షేత్రస్థాయిలో జరుగుతున్న వెరిఫికేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు.
ఎక్కడా జాప్యం జరగడానికి వీల్లేదని, పరిశీలన ప్రక్రియ వేగంగా ముగిసేందుకు అవసరమైతే అదనపు సిబ్బందిని కూడా నియమించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ పింఛన్లు దక్కేలా పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. సమాజంలో ఏ ఆసరా లేని ఒంటరి మహిళలు, వితంతువులపై ప్రత్యేక దృష్టి సారించాలని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పూర్తిస్థాయిలో పింఛన్ అందేలా చూడాలని ఆదేశించారు. ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదన్నదే తమ లక్ష్యమని, దసరా పండుగ పూట పేదలకు భరోసా కల్పించేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని మంత్రి సూచించారు.
